Thursday, June 17, 2010

గమ్యం


"యు ఆర్ అటేన్షన్ ప్లీజ్..." అంటూ
రైలు రాకను తెలియజేసే అనౌన్స్మెంట్లా,
సృష్టిలో తన రాకకు సమయమాసన్నమైందని
తల్లికి పురిటి నొప్పులు కలుగజేస్తుంది బిడ్డ.

తన ప్రయాణ ఆరంభంలో కూత కూసే రైలులా
కేర్...కేర్...అంటూ ఆరంభిస్తుంది,జీవి తన జీవన ప్రయాణాన్ని.
మార్గమధ్యంలో వచ్చే స్టేషనులన్నీ జీవిత విభిన్న దశలేసుమా!

ముందుకు సాగే రైలు విడిచిపెట్టే స్టేషన్స్లా
గడచిన జీవనదశలు వగచినా వెనుదిరిగిరావు.
సమయానికి చేరకుంటే మిస్సయ్యే రైలుబండి
అప్రమత్తత లేకుంటే లాసయ్యే సదవకాశాలకు నిదర్శనం సుమండీ!

జనసందోహంతో క్రిక్కిరిసిన ట్రైనూ,
సమస్యల వలయంలో చిక్కుకున్న బ్రెయిను...
కాలాంతరాలలో ఖాళీ అవకమానవు,
హృదయాంతరాలలో ప్రశాంతత దొరకక మానదు.

పగటి వెలుగు రేఖలలో,నిశిరాతిరి చీకటిలో, పచ్చని పైరు పొలాలలో,వెచ్చని రాతి సీమలలో,
మంచు దొంతరలలో, మండుటెండలలో,ముసురువానలలో,
పల్లెపల్లెలలో,పట్టణాలలో_ఎంతటి దూరమైనా,మరెంత భారమైనా
నిలకడగా పయనాన్ని సాగిస్తుంది, అలవోకగా నీ గమ్యాన్ని చేరుస్తుంది.

రైలు ప్రయాణంలో కలిసే సాటి ప్రయాణీకుల్లా
జీవన ప్రయాణంలో మసలే హితులూ, స్నేహితులూ,
ఎవరి గమ్యాలను వారు చేరుకుంటూ ఉంటారు.
చివరివరకూ నీకు తోడెవరు ఉంటారు?
మనందర్నీ పట్టించుకునే రైలుబండి గార్డులాగ.,మనమెవరూ పట్టించుకోని పవర్ఫుల్ గాడ్ తప్ప.

ఇంజను డ్రైవరులా నీ మనస్సు పనిచేస్తే
ఎర్ర, పచ్చ జెండాలు, దారిలోన సిగ్నల్స్లా
అంతరాత్మ ఎల్లప్పుడూ హెచ్చరికలు చేస్తుంది.
బుద్ధిగ మెలిగావంటే కష్టాలకు దూరమవుతావ్... కాదని సాగావంటే కాలగర్భంలో కలసిపోతావ్.

పేదరికంతో పోల్చే పాసింజరు బండీ, పెద్దరికం ఫీలయ్యే ఫాస్టింజను బండీ ...
చేరుకునే సమయాలలో వెనక ముందులైనా
అవి చేరకమానలేని చిట్ట చివరి గమ్యమొకటే.

అదేరీతి మనజీవన గతులు మాత్రం వేరైనా
మతాలు ఘోషించినట్లు మన జీవనగమ్యమొక్కటే,
ధూమశకట మార్గంలో సమాంతరంగా సాగిపోవు నిశ్చల పట్టాలవోలె..
మనజీవన మార్గంలో ఏనాడూ, ఏ చోటా కలిసిపోనీ, కలుపలేని
ఐహిక మొకవైపు, ఆధ్యాత్మికమొకవైపు . . .
ఈ రెంటిలో ఏ ఒక్కటి లేకున్నా, ముప్పు నీకు తప్పాదురా, ముందు బ్రతుకు శూన్యమురా.

పయనించే పదిక్షణాలు పరిస్థితులతో సర్దుకుంటే
ఆది రైలు ప్రయాణమైనా, మన జీవన యానమైనా
పొగలు గ్రక్కే కమ్మని కాఫీలా, సాగక మానదు సాఫీగా.

అందుకే నేనంటాను . . .
మానవ సృష్టిలోని ఈ రైలు ప్రయాణం.. భగవంతుడు సృష్టించిన మన జీవనయానం.

Saturday, June 12, 2010

ఆత్మ స్వరూపం


ఆకాశంతో మాట్లాడాలని మైదానం అంచుకు చేరాను.
ఆ ప్రక్క సూరీడు పెరటిలోకి వెళ్ళిపోతున్నాడు.
మైదానంలో కూర్చొని తలెత్తి పిలిచాను,
"విశాలమైన హృదయంగల ఓ నేస్తమా!" అని.

అనంతమై వ్యాపించి ఉన్న తనను పిలిచినందుకు
నన్ను మురిపిస్తూ పలికింది "ఓయ్" అంటూ!

"కదలాడే నా మనస్సును నీతో పోల్చుకుంటున్నాను.
భావాల రూపాలన్నీ ఏవేవో భాష్యాలు చెబుతున్నాయ్.
భవిష్యత్తుపై ఆశలు చిగురింపచేసే సూర్యోదయాలు,
నిరాశల నిస్సత్తువలో అణగారిపోయే సూర్యస్తమయాలు,
దిక్కుతోచని అంధకారంలో మిణుకు మిణుకుమనే
తళుక్కు తారల వలె మెరిసే ఆశల దీపాలు,

నా హృదయానికి వెన్నెలలుపరచే చందమామ,
వీచే వేడి గాలుల వంటి నిట్టూరుపులు,
బాధనుపశమింప చేసేందుకు వీచే ఓదార్పుల చల్లగాలులు...

ఇవన్నీ నీలోకూడా ఉన్నాయి కదా!
మరి నీవెందుకుఅంత గంభీరంగా ఉన్నావు?
ఊగిసలాడలేని నీ స్థితప్రజ్ఞతకు కారణమేమై ఉంటుంది?"
ప్రశాంతత కోరే నా మనస్సు అడిగిన ప్రశ్నకు
బదులుగా ఒక చిరునవ్వు చిందించింది.

"ఇంతదూరం వచ్చిన నీవు మరికొంచెం ముందుకు వెళ్ళిచూడు,
నీకే తెలుస్తుందని."
అడుగులు ముందుకు వేసిచూసాను, ఆశగా, ఆత్రంగా.
అనంత ఆకాశం ఆవలగల దేదీప్యమానమైన,
తేజోస్వరూపం కానవచ్చింది.

అప్పుడు జ్ఞానోదయమయ్యింది.
అనంతమైన అనుభూతుల అంచులు దాటి వెళ్ళగలిగితే
నాలోనే నాకు కనిపించే, నన్ను మురిపించే,
నన్ను మరపించే, ముక్తి కలిగించే, పరవసింపజేసే

నా ఆత్మస్వరూపం ..... ఆ పరమాత్మస్వరూపం

* * * * *

Wednesday, June 9, 2010

జీవన చిత్రం


దరికి చేరలేను..
దూరమవ్వలేను.

మాటలాడలేను..
మౌనిని కాలేను.

కనుల నింపలేను..
కనులు మూయలేను.

చింత మానలేను..
చింత బాపలేను.

ప్రీతి పిల్వలేను..
భ్రాంతి వదలలేను.

కోపమాపలేను..
తాపమోపలేను.

మదిని మూయలేను..
మమత నీయలేను.

సుఖము వీడలేను..
బాధ తీర్చలేను.

నిన్ను వీడలేను..
వీడి నేను లేను.
.........................

ఎంత చిత్రమాయె..
నా జీవచిత్రమ్ము!
.........................

ఛిద్రమవును కాదె..
నీవు లేకున్నను....!

Tuesday, June 8, 2010

నన్ను నీలోకి రానివ్వవూ!


నాకు నీవంటే పిచ్చి ప్రేమ.
ఈ మాట చెపితే లోకమంతా నవ్వుతుంది.
నిజమే! నేనొక పిచ్చివాడినంటుంది.
కానీ, లోకానికేం తెలుసు నీ గురించి!

నేను ప్రేమించే నీ యొక్క విశాలత, గంభీరత,
అలల నడుమ నీ కేరింతల నురుగులు.....
ఇవి మాత్రమే వారికి తెలుసు.

కానీ, నీ హృదయపు లోతుల్లో గల విలువైన రత్నాలు, మణిమకుట ద్వీపాలు, ప్రశాంతత, అన్తశ్చైతన్యమ్......
వీటి విలువ వారికేం తెలుసు?
కానీ నేను పిచ్చివాడిగానే మిగిలిపోయాను.
ఎందుకో తెలుసా?

నేను నీలో చేరి వాటి విలువ లోకానికి చెబుదామంటే
ఒద్డొద్దూ... నువ్వు తట్తుకోలేవంటూ....
నాలో నువ్వు ఈదులాడలేవంటూ....
కెరటాల సవ్వడితో నన్ను భయపెడుతూ....
ముసి ముసి నవ్వులు నవ్వుతూ, నీ ఒడ్డునే నన్ను ఆడిస్తూ
జీవితాన్ని గడిపేలా చేస్తావు.

ఏదో ఒక రోజు ఆకస్మాత్తుగా
నీపైనున్న గగనం నుండి చూస్తుంటాను.... నాకే తెలియ కుండా.
కాలం గడిచిపోతే మాత్రం నేను నీలోకి రాలేను.

నే స్త మా! నన్ను నీలోకి రానివ్వవూ!!!

Wednesday, June 2, 2010

ఆమె

ఆమె ఎవరో ఎలాంటిదో మీకెవరికీ తెలియదు.
నన్ను కని, పెంచి పెద్ద చేసిన అమ్మ ఒడిలోని చల్లదనం,
పెద్దవాడినయ్యేందుకు తండ్రి, గురువులందించిన జ్ఞానం ఇచ్చిన వెలుగు,

నాలో నేను పెంచుకున్న మమతానురాగాల మల్లె పందిరి,
జీవితంలో ఎదురైన సంఘటనలు పెంచిన మనోధైర్యం,
అవగాహన పెంచే అద్భుత సంభాషణా మాధుర్యం,

మాయని మధుర భావాలను మురిపిస్తూ రమింపచేసే హృదయస్పందన,
నాలో గల ఆరిషడ్వర్గాలను మటుమాయం చేసే చిరునవ్వు,
ప్రకృతి ఆస్వాదించమని అందించిన ఈ సౌందర్యానికి ఉపాసనా మూర్తి,

ఎదలో పొంగే వేదనాశృవులను తుడిచే అమృత హస్తం,
ఎప్పటికైనా అక్కడికే చేరాలనిపించే గమ్యం,
ఈ సృష్టిలో నన్ను నన్నుగా ప్రేమించే నాదైన ఏకైక స్వరూపం,

అన్నింటినీ మించి నన్ను చూస్తూనే మురిసి తరించిపోయే
మధురమైన భావన .
నేనే సర్వస్వమని తలంచి తపించే హృదయం.

ఆనందానికి ప్రతిరూపం... భగవంతుడిచ్చిన ఆమె రూపం...
అందుకే ఆమె నాకు అంతటి అపురూపం ...