Tuesday, July 20, 2010

హృదయం

నా హృదయం అలౌకికానందంతో ఉప్పొంగిపోతోంది.
మూలమేమిటా అని పరిశీలనగా చూశాను.

ఒక చిన్న తీగ దొరికింది. అదొక మాటల తీగ.
ఆ తీగ ఆధారం కోసం చూశాను. ప్రక్కనుండి నవ్వుల పసిడి తీగ.

కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే
అద్భుత సౌందర్యలతా ప్రేమసుమాలు పలుకరిస్తున్నాయి.

వాటి ప్రక్కనే విరిసిన శృంగార నవమల్లికాలతలు
నన్నల్లుకుని పులకాంకితుడిని చేస్తున్నాయి.

అసలిన్ని తీగలు ఎక్కడ నుండి ఉద్భవించాయో..!
సున్నితంగా సునిశితంగా పరికిస్తే.........

ఆశ్చర్యం! నీ ప్రేమాన్విత హృదయంలోని
స్నేహమనే చిరుబీజాన్ని నా హృదయంలో వెదజల్లావుగా !

ఆ బీజమే హృదయమంతా అల్లుకుని నాకింత ఆనందాన్ని పంచుతోంది.
నేస్తమా ! ఎంత బావుందో...
'నా' అనుకుంటున్న 'నీ' హృదయం.



Tuesday, July 6, 2010

నేస్తమా!

కనులు తెరుస్తూనే నా మది నీ కోసం వెతుక్కుంటుంది.
ఎందుకో తెలుసా...?

కనులు మూసుకుని నిదురించే సమయంలో,
నీ తలపుల భావలహరి అందించిన
మధురోహల సుందర రూపాన్ని చూడాలని.

Monday, July 5, 2010

సుదూర బాటసారి


గత జన్మల అనుబంధాలు గుర్తుకు వచ్చేలా
ఈ జన్మలో నీవే సర్వస్వమన్నట్లు జీవించే

నా చూపులు నిన్ను చేరలేకపోతుంటే,
నా మాటలు నీ చెవిని సోకలేకపోతుంటే,
నా అడుగులు ఏవో పాశాలచే బంధించ బడుతుంటే,
నా భావాలు నాలోనే మ్రగ్గి పోతుంటే...

ఒక్కొక్క సారి. ఒక్కొక్కటి.. ఒక్కొక్కలా...
ఒక్కొక్క మాట. ఒక్కొక్కచూపు.. ఒక్కొక్క అడుగు...
ఒకటొకటిగా అన్నీ ఒకటిగా చేరి
నీ హృదయాన్ని నాకు దూరం చేస్తుంటే...

నా చూపులు చూపు కోల్పోయి,
నా పిలుపు నిశ్శబ్ద శబ్దంగామారి,
నా అడుగులో గమనం లేని అగమ్య చలనంతో
నా ఊహలు నిర్జీవ భావాలుగా మారిపోతే...

నా చైతన్యం అచేతనంగా మారి
అంతమేలేని అనంతజీవన పయనాన్ని అంతంచేస్తుంటే...

నేస్తమా! నీ దరికి చేరే భాగ్యాన్ని కోల్పోయి
జీవనలక్ష్యాల వైపు పయనించలేని
సుదూర బాటసారిగా మిగిలిపోతాను.