Thursday, April 29, 2010

తరింపజేయవూ. . . . .


నా హృదయంలో ప్రేమ అనే మంచు బిందువులను కురిపించి,
నులివెచ్చని నీ చూపులనే కిరణాలను ప్రసరింపజేసి,
ఆనందానుభూతుల హరివిల్లు విరియజేసి,
మురిపించిన నేస్తమా!.....

నా హృదయ కుసుమాన్ని నీకే అర్పిస్తున్నాను.
నీ చేతులలోకి స్వీకరించి నన్ను తరింపజేయవూ !

Sunday, April 18, 2010

ఒంటరితనమే


అల్లారుముద్దుగా అందరూ నన్నెత్తుకుని నడుస్తుంటే
అదొక అద్భుతలోకమని పరవశించిపోయాను
నడక నేర్పి నన్ను కిందికి దింపినప్పుడు
ఆనందంతో అడుగులు వేస్తూ వడివడిగా పరుగులెత్తాను.

నేను నడుస్తున్న దారిలో ఒక్కొక్కప్పుడు..
ఒక్కొక్కచోట.. ఒక్కొక్క లక్ష్యం.
కొన్నిసార్లు చేరినట్లు..... కొన్నిసార్లు చేరిపోతున్నట్లు..
కొన్నిసార్లు చేజారిపోతున్నట్లు.....

కాలగమనం గుర్తుకు రావడంలేదు ఆనందంలో,
కాలమే గమించడం లేదు విషాదంలో.
ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా.
నాతో కలిసి నడుస్తున్నది నా కోసమే అన్నట్లు... కానీ

నన్ను నేను వ్యక్తపరచుకున్న మరుక్షణం ...
నన్ను అంగీకరించలేక...ఆస్వాదించలేక
ఔననలేక కాదంటూ... కాదనలేక మౌనంగా ఉంటూ

పట్టీపట్టనట్లుగా ... పట్టుకోలేనట్లుగా...
కలసి అడుగులు వేస్తూ ... దారిపొడవునా

కలిసీ కలవని .. కలుపుకోలేని
కలతలు నిండిన తలపులతో..
రంగులు పులిమిన మనసులతో...
కలిసి రాలేక విడిపోయేవారూ... విడిపోలేక కలిసి వచ్చేవారూ...
చివరకు మిగిలేది మాత్రం......... ఒంటరితనమే

Thursday, April 1, 2010

హృదయంలేని మనిషి

ప్రియనేస్తం!
నీకోసం నలుదిక్కులా వెతికాను, నలుమూలలా గాలించాను.
కానీ! ..... నీ జాడ కనిపించలేదు.
ఇంతలోనే గుర్తొచ్చింది ... నువ్వు నా హృదయంలోనే ఉన్నావని.
అంతే! నా హృదయంలో ఉన్న నిన్ను చూద్దామని లోపలికి తొంగి చూసాను.
తీరా చూస్తే ... ఏమయిందో, ఎటుపోయిందో
నా హృదయమే లేదు.
నీదైన నా హృదయం కోసం వెతుకుతుంటే గుర్తొచ్చింది
భగవంతుడి పిలుపు విని వెళ్లిపోయిన
నీ హృదయంలో నా హృదయం ఉండిపోయిందని.
ఏ సుదూర తీరాలలో విశ్రమిస్తున్నావో, ఏ సుందర లోకాలలో విహరస్తున్నావో,
కానీ, నా ఈ చర్మ చక్షువులకు గోచరించడంలేదు.
మనో నేత్రాలతో చూసినా తనివి తీరడంలేదు.
నా పిలుపు నిన్ను చేరదని తెలిసినా
నోరారా పిలవాలని ఉంది "పిల్లా!" అని.
వెంటనే నీ దరిచేరి, నిన్ను హత్తుకుని చంటి పిల్లాడిలా ఏడవాలని ఉంది.
చేరుదామంటే ఎక్కడున్నావో తెలీదు.
నాకుమాత్రం తలుపులు మూసుకునే ఉన్నాయ్!
భగవంతుడికి నీవంటే ఉన్నప్రేమ నాపై లేదని బాధపడుతున్నాను.
మన అనుబంధాన్ని ఋణానుబంధంగా సరిపెట్టుకోలేక పోతున్నాను.
అన్నీ కలసిన మనలను కలిపి మేలు చేసాడని తలచేలోపే
కలసిన మనలను విడదీసినందుకు
భగవంతుడిని ఏమనాలో తెలియడం లేదు.
అందుకే నేనొక
హృదయంలేని మనిషిలా మిగిలిపోయాను
.