Saturday, December 3, 2011

ఎక్కువ

అనామికగా నన్ను వదిలేసాడు
ఆయనొక గొప్ప మాయగాడు
ఆటలాడడం ఆయనకు చాలా సరదా
మభ్యపెట్టడం మరింత సరదా
దోబూచులాడడం ఆయనకు అలవాటె.
ఒకరిని కలపాలంటేమరొకరిని తీసేయాల్సిందే.
అలా తీసేస్తాడనీ, నమ్మించి మోసం చేస్తాడని తెలియలేదు.
నేనేదో గొప్పవాడిననే భావన నా నేస్తానికి కల్పించి,
నాకున్నదంతా ఒట్టి అజ్ఞానమని అనిపించడానికి
ఆయన ఎంత పన్నాగం పన్నాడో.
తానే నా సర్వస్వమని తనతో చెప్పించి
తనకు మాత్రం నేనేమీ కానని చెప్పాడు.
సత్యం వేరే ఉందని నమ్మబలికాడు
నాకు ప్రేమించడం చేతకాదని ఋజువు చేశాడు.
ఆయన ప్రేమలాగా నా ప్రేమ గొప్పది కాదని
నేనొట్టి మనిషినేనని నా నేస్తానికి నన్ను దూరం చేస్తున్నాడు.
ఎందుకో తెలుసా?
నా నేస్తమంటే నాకు ఆయన కన్నా ఎక్కువని భావించానని.

Friday, March 25, 2011

బందీ

ఎవరు నీవు?
నీవు నాకు ఏమవుతావు?
నీకు సర్వస్వము నేనే అన్నట్లు
నీ మది తలుపులు తెరచి, వాకిట నిలచి,
ఏ మాలిన్యమూ అంటని మధురమైన ప్రేమామృతాన్ని నీగుండెలలో నింపుకుని
నా కోసమే పంచడానికి ఎదురు చూస్తున్ననీ కన్నులకు
నా రూపమే అపురూపమై
జన్మజన్మల అనుబంధమైనట్లు.....
గతమంతా మరపించి, మది పులకించిపోయేలా
ఎన్ని జన్మలైనా తోడుండాలని కోరే
నీవెవరు?
ఏమీ లేని నన్ను అన్నీ ఉన్నవాడిని చేసిన
పరమాత్ముడి మరో రూపానివా?
వలచి వరించ వచ్చిన నీకు ఏమివ్వగలను?
నాకున్న ఈ చిన్న హృదయం తప్ప...
ఏ బంధాలతోనూ కట్టిపడేయలేని అనుబంధంతో పెనవేసుకున్న
నీకు నేనేమవ్వగలను?
విశాలమైన నీ హృదయంలో "బందీ"ని తప్ప......!

Tuesday, January 11, 2011

హృదయ స్పందన

ఎక్కడినుంచో ఒక శ్రావ్యమైన సుస్వర గీతం
నా చెవులకు దగ్గరవుతూ, నాకోసమే అంటూ, నేనున్నానంటూ..
నా గుండెలో చేరి, ఎదసవ్వడితో కలసి
హృదయస్పందనగా మారింది.
ఆ తరంగాలు ఎదలోతుల్లో గల మధుర భావాలను మీటి,
హృదయవీణపై వేలరాగాలను పలికించసాగాయ్.
సుస్వర సంగీతఝరిలో ఈ లోకాలను దాటి
నా హృదయం ఆకాశమంత విశాలంగా మారింది.
ఎల్లలులేని ఆకాశంలో ఎటుచూసినా ఆ గీతామాధుర్యమే!
వినీల ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ, రమిస్తూ,
నన్ను నేనే మర్చిపోతూ, పరవశించి మురిసిపోతుంటే..
ఎక్కడినుండి వచ్చాయో.......ఏమో!
ఏవో శ్రుతిలేని రాగాలు....ఆ గీతాలాపనను భగ్నం చేస్తూ..
వినిపించుకోవాలని చెవులను ఎంత రిక్కించినా
అస్పష్టంగా కాసేపు, అంతలోనే స్పష్టంగా, అంతకంటే నిశ్శబ్దంగా
వినిపిస్తూ... వినిపించకుండాఉంటే
ఏదో తెలియని అసందిగ్ధ అచేతనావస్థలోకి నా హృదయం జారిపోతోంది.
ఆ గీతం నన్ను విడిచివెళ్తోందా? వినిపించకుండాపోతుందా?
ఇంక నా హృదయానికి స్పందనేది?
హృదయవీణతంత్రులేవి? మధురభావలహరులేవి?
నీ మౌనగీతంతో నా హృదయం నిశ్చలమై పోతోంది.
నేస్తమా!
నీ హృదయం పాడే ఆ పాట నాకు వినిపింపజేయవూ!
నీ హృదయానికి హత్తుకుని నా హృదయానికి జీవం పోయవూ!

Sunday, August 8, 2010

ప్రేమ పరిమళ౦


వీచే౦దుకు గాలికి శక్తి లేక,
ఇప్పుడు నీ హృదయంలో గల
ప్రేమ పరిమళాలు నన్ను చేరలేక పోవచ్చును.
కానీ........
ఆఘ్రాణి౦చిన నాకు తెలుసులే..
అవి ఎంత తీయనివో, తీయలేనివో.


Tuesday, July 20, 2010

హృదయం

నా హృదయం అలౌకికానందంతో ఉప్పొంగిపోతోంది.
మూలమేమిటా అని పరిశీలనగా చూశాను.

ఒక చిన్న తీగ దొరికింది. అదొక మాటల తీగ.
ఆ తీగ ఆధారం కోసం చూశాను. ప్రక్కనుండి నవ్వుల పసిడి తీగ.

కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే
అద్భుత సౌందర్యలతా ప్రేమసుమాలు పలుకరిస్తున్నాయి.

వాటి ప్రక్కనే విరిసిన శృంగార నవమల్లికాలతలు
నన్నల్లుకుని పులకాంకితుడిని చేస్తున్నాయి.

అసలిన్ని తీగలు ఎక్కడ నుండి ఉద్భవించాయో..!
సున్నితంగా సునిశితంగా పరికిస్తే.........

ఆశ్చర్యం! నీ ప్రేమాన్విత హృదయంలోని
స్నేహమనే చిరుబీజాన్ని నా హృదయంలో వెదజల్లావుగా !

ఆ బీజమే హృదయమంతా అల్లుకుని నాకింత ఆనందాన్ని పంచుతోంది.
నేస్తమా ! ఎంత బావుందో...
'నా' అనుకుంటున్న 'నీ' హృదయం.



Tuesday, July 6, 2010

నేస్తమా!

కనులు తెరుస్తూనే నా మది నీ కోసం వెతుక్కుంటుంది.
ఎందుకో తెలుసా...?

కనులు మూసుకుని నిదురించే సమయంలో,
నీ తలపుల భావలహరి అందించిన
మధురోహల సుందర రూపాన్ని చూడాలని.

Monday, July 5, 2010

సుదూర బాటసారి


గత జన్మల అనుబంధాలు గుర్తుకు వచ్చేలా
ఈ జన్మలో నీవే సర్వస్వమన్నట్లు జీవించే

నా చూపులు నిన్ను చేరలేకపోతుంటే,
నా మాటలు నీ చెవిని సోకలేకపోతుంటే,
నా అడుగులు ఏవో పాశాలచే బంధించ బడుతుంటే,
నా భావాలు నాలోనే మ్రగ్గి పోతుంటే...

ఒక్కొక్క సారి. ఒక్కొక్కటి.. ఒక్కొక్కలా...
ఒక్కొక్క మాట. ఒక్కొక్కచూపు.. ఒక్కొక్క అడుగు...
ఒకటొకటిగా అన్నీ ఒకటిగా చేరి
నీ హృదయాన్ని నాకు దూరం చేస్తుంటే...

నా చూపులు చూపు కోల్పోయి,
నా పిలుపు నిశ్శబ్ద శబ్దంగామారి,
నా అడుగులో గమనం లేని అగమ్య చలనంతో
నా ఊహలు నిర్జీవ భావాలుగా మారిపోతే...

నా చైతన్యం అచేతనంగా మారి
అంతమేలేని అనంతజీవన పయనాన్ని అంతంచేస్తుంటే...

నేస్తమా! నీ దరికి చేరే భాగ్యాన్ని కోల్పోయి
జీవనలక్ష్యాల వైపు పయనించలేని
సుదూర బాటసారిగా మిగిలిపోతాను.