Tuesday, January 11, 2011

హృదయ స్పందన

ఎక్కడినుంచో ఒక శ్రావ్యమైన సుస్వర గీతం
నా చెవులకు దగ్గరవుతూ, నాకోసమే అంటూ, నేనున్నానంటూ..
నా గుండెలో చేరి, ఎదసవ్వడితో కలసి
హృదయస్పందనగా మారింది.
ఆ తరంగాలు ఎదలోతుల్లో గల మధుర భావాలను మీటి,
హృదయవీణపై వేలరాగాలను పలికించసాగాయ్.
సుస్వర సంగీతఝరిలో ఈ లోకాలను దాటి
నా హృదయం ఆకాశమంత విశాలంగా మారింది.
ఎల్లలులేని ఆకాశంలో ఎటుచూసినా ఆ గీతామాధుర్యమే!
వినీల ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ, రమిస్తూ,
నన్ను నేనే మర్చిపోతూ, పరవశించి మురిసిపోతుంటే..
ఎక్కడినుండి వచ్చాయో.......ఏమో!
ఏవో శ్రుతిలేని రాగాలు....ఆ గీతాలాపనను భగ్నం చేస్తూ..
వినిపించుకోవాలని చెవులను ఎంత రిక్కించినా
అస్పష్టంగా కాసేపు, అంతలోనే స్పష్టంగా, అంతకంటే నిశ్శబ్దంగా
వినిపిస్తూ... వినిపించకుండాఉంటే
ఏదో తెలియని అసందిగ్ధ అచేతనావస్థలోకి నా హృదయం జారిపోతోంది.
ఆ గీతం నన్ను విడిచివెళ్తోందా? వినిపించకుండాపోతుందా?
ఇంక నా హృదయానికి స్పందనేది?
హృదయవీణతంత్రులేవి? మధురభావలహరులేవి?
నీ మౌనగీతంతో నా హృదయం నిశ్చలమై పోతోంది.
నేస్తమా!
నీ హృదయం పాడే ఆ పాట నాకు వినిపింపజేయవూ!
నీ హృదయానికి హత్తుకుని నా హృదయానికి జీవం పోయవూ!