Saturday, June 12, 2010

ఆత్మ స్వరూపం


ఆకాశంతో మాట్లాడాలని మైదానం అంచుకు చేరాను.
ఆ ప్రక్క సూరీడు పెరటిలోకి వెళ్ళిపోతున్నాడు.
మైదానంలో కూర్చొని తలెత్తి పిలిచాను,
"విశాలమైన హృదయంగల ఓ నేస్తమా!" అని.

అనంతమై వ్యాపించి ఉన్న తనను పిలిచినందుకు
నన్ను మురిపిస్తూ పలికింది "ఓయ్" అంటూ!

"కదలాడే నా మనస్సును నీతో పోల్చుకుంటున్నాను.
భావాల రూపాలన్నీ ఏవేవో భాష్యాలు చెబుతున్నాయ్.
భవిష్యత్తుపై ఆశలు చిగురింపచేసే సూర్యోదయాలు,
నిరాశల నిస్సత్తువలో అణగారిపోయే సూర్యస్తమయాలు,
దిక్కుతోచని అంధకారంలో మిణుకు మిణుకుమనే
తళుక్కు తారల వలె మెరిసే ఆశల దీపాలు,

నా హృదయానికి వెన్నెలలుపరచే చందమామ,
వీచే వేడి గాలుల వంటి నిట్టూరుపులు,
బాధనుపశమింప చేసేందుకు వీచే ఓదార్పుల చల్లగాలులు...

ఇవన్నీ నీలోకూడా ఉన్నాయి కదా!
మరి నీవెందుకుఅంత గంభీరంగా ఉన్నావు?
ఊగిసలాడలేని నీ స్థితప్రజ్ఞతకు కారణమేమై ఉంటుంది?"
ప్రశాంతత కోరే నా మనస్సు అడిగిన ప్రశ్నకు
బదులుగా ఒక చిరునవ్వు చిందించింది.

"ఇంతదూరం వచ్చిన నీవు మరికొంచెం ముందుకు వెళ్ళిచూడు,
నీకే తెలుస్తుందని."
అడుగులు ముందుకు వేసిచూసాను, ఆశగా, ఆత్రంగా.
అనంత ఆకాశం ఆవలగల దేదీప్యమానమైన,
తేజోస్వరూపం కానవచ్చింది.

అప్పుడు జ్ఞానోదయమయ్యింది.
అనంతమైన అనుభూతుల అంచులు దాటి వెళ్ళగలిగితే
నాలోనే నాకు కనిపించే, నన్ను మురిపించే,
నన్ను మరపించే, ముక్తి కలిగించే, పరవసింపజేసే

నా ఆత్మస్వరూపం ..... ఆ పరమాత్మస్వరూపం

* * * * *

4 comments: